
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా వండర్ `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీ కృష్టా మూవీస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఓ కాల్పనిక ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు.
ఇందు కోసం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ప్యాలెస్ సెట్‌ని భారీగా నిర్మించారు. కరోనా కారణంగా షెడ్యూల్ అంతా అప్‌సెట్ అయింది. ఆగస్టు లో తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ తన 21వ చిత్రాన్ని `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ పాన్ ఇండియాకు మించి తెరపైకి తీసుకురాబోతున్నారు.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఈ నెలాఖరున ఇస్తానంటూ ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి వెల్లడించారు. దీంతో ఎలాంటి వార్తని ప్రకటించబోతున్నారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్‌కు జోడీ గా బాలీవుడ్ భామ దీపికా పదుకునే ని ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీపిక భారీగా డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో కియారాని సంప్రదిస్తున్నారని తాజాగా వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ గా అత్యంత భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు.