
స్టైలిష్ స్టార్ బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ , ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. బన్నీ – సుక్కుల కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా.. పైగా ఇండస్ట్రీ హిట్ `అల వైకుంఠపురములో` తరువాత రానున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 10న ఏపీలోని మారేడు మిల్లి డీప్ ఫారెస్ట్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు సినిమాలోని కీలక తారగణం పాల్గొంటున్నారు. ఇటీవల బన్నీ పుట్టిన రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో సినిమాపై అభిమానులతో పాటు ఆడియన్స్‌లో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ `ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. నా కెరీర్‌లో ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. యూనరివర్సల్ అప్పీల్ వున్న పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ ఈ కథని అద్భుతంగా సిద్ధం చేశారు.కోవిడ్ క్రైసిస్ మధ్య మా యూనిట్ ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది` అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ `పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్ని భాషల్లో వున్న బన్నీ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చే రీతిలో ఈ మూవీ స్టోరీని రెడీ చేశాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చిత్ర నిర్మాతల సహకారంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో షూటింగ్ చేస్తున్నాం` అని తెలిపారు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో కోవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.