
`మైనే ప్యార్‌కియా` (ప్రేమ పావురాలు).. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యావత్ భారతావనికి పరిచయమైన పేరు భాగ్యశ్రీ. 1989లో వచ్చిన ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ తొలి సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. రాజశేఖర్ నటించిన `ఓంకారం`, బాలకృష్ణ నటించిన `రాణా` చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
మళ్లీ ఇన్నేళ్ల తరువాత ప్రభాస్ నటిస్తున్న `జాన్` సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరో ప్రభాస్‌కు తల్లిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు `తలైవి`లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా భాగ్యశ్రీ వెల్లడించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో `తలైవి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగన రనౌత్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి భాగ్యశ్రీ స్పందించారు. `సినిమాలో తన పాత్ర చాలా కీలకంగా వుంటుందని, తలైవి జీవితం ముఖ్యమైన మలుపు తిరగడానికి తన పాత్ర కారణంగా నిలుస్తుందని, సెప్టెంబర్ నుంచే ఈ చిత్రంలో నటిస్తున్నానని, కంగణతో కలిసి నటించడం ఫన్‌గా వుందని, ఆమె చాలా గొప్ప నటి అని ఈ సందర్భంగా వెల్లడించింది.