
సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఉండే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అందులోనూ బాహుబలి వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా అంటే హంగామా ఎలా ఉంటుందో మళ్ళీ చెప్పేదేముంది. ఇక ఆ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తుంటే ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఉండాలి. ఆర్ ఆర్ ఆర్ నాలుగైదు భాషల్లో కాదు ఏకంగా 10 భాషల్లో విడుదలవుతున్న సినిమా. బాహుబలిని మించిన బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మీద ఆకాశాన్నంటే రేంజ్ లో కాదు, దానికి మించే రేంజ్ లో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా హిట్టవుతుందా లేదా అన్నది కాకుండా ఎంత పెద్ద హిట్టవుతుంది అన్న దానిపైనే అందరి ఆలోచనలు ఉన్నాయి. అయితే ఎంత రాజమౌళి దర్శకుడైనా భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైతే ఏంటి పరిస్థితి. ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్న స్థాయికి మాములు హిట్ అయితే సరిపోదు. బాహుబలి కలెక్షన్స్ ను దాటి మరో స్థాయిలో హిట్ అవ్వాలి. మరి ఆ స్థాయి విజయం ఆర్ ఆర్ ఆర్ సాధించగలదా?
దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు బాహుబలి రైటర్ మదన్ కార్కీ. తమిళ వెర్షన్ కు మాటలు రాసాడు ఈ రచయిత. బాహుబలిలో భిన్న భాష అయిన కిలికి భాషను కూడా కనిపెట్టాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు మాటల రచయితగా పనిచేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మదన్ మాట్లాడుతూ బాహుబలిని మించిన సినిమాగా ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందని తెలిపాడు. ఈ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉన్నా కానీ దానికి మించిన స్థాయిలో సినిమా ఉంటుందని, ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలు అద్భుతంగా వస్తున్నాయని, ఒక పాత్రను మించి మరో పాత్ర ఉంటుందని తెలిపాడు.
బాహుబలి తరహాలోనే ఈ చిత్రం అన్ని భాషల వాళ్ళను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేసాడు మదన్ కార్కీ.