
క్రేజ్, సూపర్ హిట్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. స్వతహాగా మలయాళీ అయినా యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ కుట్టి తన మాతృభాష మలయాళ చిత్రంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని నటించిన `మజ్ను` చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత మాత్రం వరుస ఫ్లాపుల్ని దక్కించుకుంది.
గోపీచంద్‌తో కలిసి నటించిన `ఆక్సిజన్`, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో చేసిన `అజ్ఞాతవాసి`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, నాగచైతన్యతో చేసిన `శైలజారెడ్డి అల్లుడు`.. ఈ చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో అనుకు తెలుగులో సినిమాలు లేకుండా పోవడంతో తన మకాంని తమిళ ఇండస్ట్రీకి మార్చింది. అక్కడ శివకార్తికేయన్‌తో `నమ్మవీట్టు పిళ్లై` చిత్రంలో నటించింది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రమే నటించాలనుకున్న అను తాజాగా తన పంథా మార్చుకుందట.
తన వద్దకు ఏ అవకాశం వస్తే దాన్ని ఓకే చేస్తోంది. తాజాగా తెలుగులో మళ్లీ స్పీడు పెంచేసింది. అల్లు శిరీష్‌తో ఓ చిత్రం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `అల్లుడు అదుర్స్` అనే టైటిల్‌ని ఇటీవలే ఫిక్స్ చేశారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇన్నింగ్స్ అయినా అనూని సక్సెస్ బాట పట్టిస్తుందో చూడాలి.