
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఇప్పటి వరకు లైకా సంస్థ 2.ఓ, దర్బార్ చిత్రాల్ని నిర్మించింది. తమిళంలో స్టార్ హీరొలలో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. త్వరలో టాలీవుడ్‌లోనూ ప్రవేశించబోతున్నారు. ఇటీవల రజనీతో `దర్బార్` చిత్రాన్ని నిర్మించిన లైకా త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రానికి ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారట.
లైకా సంస్థ `దర్బార్` చిత్రీకరణకు ముందే మురుగదాస్‌తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. అందులో భాగంగానే రెండవ చిత్రాన్ని అల్లు అర్జున్‌తో నిర్మించబోతోందిట. ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్రంతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్‌ని సొంతంచేసుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని సాధించి రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ మార్కెట్‌లో 3.5 మిలియన్‌లు సాధించి నాన్ బాహుబలి విభాగంలో యూఎస్ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లని సొంతం చేసుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.
20 రోజులు దాటినా అదే హవాని కొనసాగిస్తుండటంతో ఈ సినిమా మరిన్ని రికార్డుల్ని తిరగరాలే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లైకాతో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు కావడంతో బన్నీ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారట. తెలుగులో మురుగదాస్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఆయన చేసిన స్టాలిన్, స్పైడర్ చిత్రాలు ఫ్లాప్ కావడమే బన్నీ ఫ్యాన్స్ భయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.