
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రకు ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తారు. అంటే రియల్ లైఫ్ పాత్రల నుండి తీసుకున్న కల్పిత కథ ఆర్ ఆర్ ఆర్.
ఈ సినిమా విడుదలవ్వడానికి ఇంకా చాలా నెలల సమయమున్నా ఈ చిత్రంపై ఉన్న బజ్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు తప్పించి మరే పాత్ర గురించి వివరాలు చెప్పలేదు రాజమౌళి. అయితే లేటెస్ట్ గా అజయ్ దేవగన్ పాత్ర ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
దానిప్రకారం ఇందులో అజయ్ దేవగన్.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లకు మెంటర్ గా వ్యవహరించిన పాత్రలో కనిపిస్తాడట. కథ ప్రకారం ఇద్దరికీ బ్రిటీషు వారి అణిచివేతను ప్రశ్నించే గుండెధైర్యాన్ని నింపే పాత్రలో నటించనున్నాడు. కథను కీలక మలుపు తిప్పే పాత్ర కాబట్టి మొదట కొంత సందేహించినా అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ పాత్ర వచ్చాక సినిమా మరో లెవెల్ కు వెళ్తుందని అంటున్నారు. వింటుంటేనే ఇంత థ్రిల్లింగ్ గా ఉంది కదా.. మరి చూడాలంటే మాత్రం జూలై 30, 2020 వరకూ వేచి చూడక తప్పదు.