
మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రొమోషన్ల ఫై దృష్టి సారించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెరుగగా..ఈరోజు సాయంత్రం సినిమాలోని భలే భలే బంజారా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి , రామ్ చరణ్ లు కలిసి అదిరిపోయే స్టెప్స్ వేసి మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
ఈ సాంగ్ రిలీజ్ సందర్బంగా చిరంజీవి , చరణ్ లు ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ”నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది. ‘భలే భలే బంజారా’ కోసం నా ఎనర్జిటిక్ రామ్ చరణ్ తో కలిసి కాలు కదపడం ఎంతో సంతోషంగా ఉంది. నా గ్రేస్ తో నేను అతన్ని డామినేట్ చేశానని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేయగా..”నిస్సందేహంగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. మా నాన్న నా #ఆచార్య చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయడంలోని ఆనందాన్ని గౌరవాన్ని మాటల్లో చెప్పలేను” అని రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.
