
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. క్యాన్సర్తో పోరాడి గెలిచిన కందికొండ పెరాలసిస్ బారిన పడి నడవలేని స్థితికి చేరిపోయారు. ఇటీవల ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న కందికొండకు తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు ఆర్థికంగా సాయం చేశారు. గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న కందికొండ.. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలోని నాగురపల్లె గ్రామంలో జన్మించిన కందికొండ.. చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ప్రాణం. దాంతో డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో ఉన్న అనుబంధంతో పాటల రచయితగా ఇండస్ట్రీలో తనదైన ముద్రని వేసుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలోని మల్లికూయవే గువ్వా కందికొండ రాసిన ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ హిట్ కావడమే కాదు.. చక్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన అన్ని సినిమాల్లో కందికొండ పాటలు రాశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన చివరగా శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతల రాయుడు’ సినిమాలో ‘ఓ తలపై’ పాటను రాశారు. కందికొండ అంత్యక్రియలు రేపు హైదరాబాద్లో నిర్వహించనున్నారు.