
మహేష్‌బాబు హీరోగా నటించిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఇచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా రికార్డుల్ని సొంతం చేసుకుంది.
13 ఏళ్ల విరామం తరువాత ఈ చిత్రం ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం తన కన్న బిడ్డల ప్రాణాల్ని ధారపోయిన మాతృమూర్తిగా, సంఘంలో తప్పుజరిగితే నిలదీసే ప్రొఫెసర్ భారతగా విజయశాంతి పాత్రని ఇందులో పవర్‌ఫుల్‌గా తీర్చి దిద్దారు. అయితే ఈ పాత్ర కోసం ఆమెని ఒప్పించడానికి దర్శకుడు చిన్న పాటి తపస్సే చేయాల్సి వచ్చింది. పదుల సార్లు ప్రయత్నిస్తే తప్ప ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించలేదట.
ఈ సినిమా విజయంలో విజయశాంతి పాత్ర కూడా కీలకంగా మారడంతో విజయశాంతికి మళ్లీ వరుస ఆఫర్లు రావడం మొదలైంది. రీ ఎంట్రీకి 5 కోట్లు డిమాండ్ చేశారని ప్రచారం జరిగింది. తాజాగా వస్తున్న ఆఫర్లని కూడా కండీషన్‌లు పెడుతున్నారట. అవి కొంత ఇబ్బందిగా వుండటంతో నిర్మాతలు తిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.