
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలన్నా.. ట్వీట్ చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ తరువాత ఆ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్ చేయాలన్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కానీ ఈ విషయంలో తనికెళ్ల భరణి కొంత మంది మనసు నొప్పించారట. ఫేస్ బుక్‌లో ఆయన కొద్దిరోజుల క్రితం పెట్టిన ఒక పోస్ట్ పై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు తనికెళ్లభరణి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక వీడియో పంచుకున్నారు. ఏ మనిషికి ఇతరుల మనసును నొప్పించే హక్కు లేదని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు.
`గత కొన్ని రోజులుగా `శభాష్ రా శంకరా..` అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నా. అయితే .. దురదృష్ణవశాత్తూ కొన్ని వ్యాఖ్యలు కొంత మంది మనసును నొప్పించాయని తెలిసింది. దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ పోస్టును తొలగించాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా` అని సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు తనికెళ్లభరణి.
నేను ఎవ్వరికీ వ్యతిరేకిని కాదు..! pic.twitter.com/G0098sPtYW
— Tanikella Bharani (@TanikellaBharni) April 15, 2021