
దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి మాజీ అసిస్టెంట్ డైరెక్టర్, సుశాంత్ స్నేహితుడు రిషికేశ్ పవార్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మంగళవారం అరెస్టు చేసింది. గత 30 రోజుల నుండి పవార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఎన్‌సీబీ దర్యాప్తు చేసిన డ్రగ్స్ కేసులో రిషికేశ్ పవార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు గత నెలలో తిరస్కరించింది.
అప్పటి నుండి ఎన్సీబీ అధికారులు రిషికేశ్ పవార్ కోసం గాలిస్తున్నారు. రిషికేశ్ పవార్ ని అంతకుముందు 2020 సెప్టెంబర్‌లో ఎన్‌సిబి.. సుశాంత్ సింగ్ తో సంబంధం ఉన్న ఇతరులతో పాటు ప్రశ్నించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించడానికి ఒక నెల ముందు డ్రగ్స్ సరఫరా చేయడంలో పవార్ ప్రధాన పాత్ర పోషించాడని నమ్ముతున్నారు.
పవార్ అక్రమంగా డ్రగ్స్ సేకరించడం, సుశాంత్ సింగ్ కి సరఫరా చేయడం కోసం సుశాంత్ సిబ్బందిలోని సావంత్ సహకరించారట. సుశాంత్ కోసం పనిచేయడం ప్రారంభించడానికి ముందు దివంగత నటుడికి డ్రగ్స్ పంపిణీ చేసినది పవార్ అని సావంత్ తన ప్రకటనలో చెప్పడంతో అసలు కథ బయటపడింది. దీంతో ఎన్‌సిబి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పవార్ వెంటనే ముంబై సెషన్స్ కోర్టు, బొంబాయి హైకోర్టులను ఆశ్రయించారు. కానీ తను పెట్టిన బెయిల్ పిటీషన్‌లని ఈ రెండు కోర్టులు తిరస్కరించాయి.