
టీమిండియా సొగసరి ఆటగాడు సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండర్ తాజాగా ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా.
నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, చెన్నై టీం, రాజీవ్ శుక్లా సర్, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు రైనా. కాగా ధోనీతో పాటు సురేష్ రైనా 2020లో కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు.
అయితే ఐపీఎల్ 15వ సీజన్‌లో రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అతడితో పాటు పీయూష్ చావ్లా, ధవల్ కులకర్ణి, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ తొలి సారి ఐపీఎల్‌లో కామెంటరీ ప్యానెల్‌లో చేరారు. ఇది ఇలా ఉంటే.. 11 సీజన్‌లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు రైనా ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా కూడా రైనా వ్యవహరించాడు. వయస్సు 35 ఏళ్లు దాటిన దృష్ట్యా క్రికెట్ నుంచి తప్పుకోవాలని రైనా భావిస్తున్నట్లు సమాచారం. మిస్టర్ ఐపీఎల్ పేరున్న రైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన అతను.. 5,528 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో రైనా 226 వన్డేలు ఆడి 5, 615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 1, 605 రన్స్ చేశాడు. కాగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో రైనా కూడా ఒకడు.