
సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల జీవితాన్ని బ్రహ్మోత్సవం అనే ఒకే ఒక్క సినిమా పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాతో ప్లాప్ మాత్రమే కాకుండా చెత్త సినిమా అంటూ విమర్శలు ఎదుర్కొన్న శ్రీకాంత్ అడ్డాల సినిమా విడుదలై మూడేళ్లు దాటినా కానీ మరో సినిమాను ఓకే చేసుకోలేకపోయాడు. ఇంతకంటే దారుణమైన చిత్రాలు తీసిన దర్శకులు ఉన్నారు. అయినా కానీ వారు త్వరగానే కోలుకున్నారు.
మరి శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఇప్పటిదాకా ఎందుకని మరో సినిమాను చేజిక్కించుకోలేకపోయాడు? నిజానికి గీతా ఆర్ట్స్ గతేడాదే శ్రీకాంత్ అడ్డాలకు సినిమా ఆఫర్ ఇచ్చింది. తనే కథ సెట్ చేసుకుని ఎవరో ఒక హీరోని ఒప్పిస్తే సినిమా తీయడానికి తాము రెడీ అని చెప్పింది. అయితే అడ్డాల మాత్రం ఇంతవరకూ ఏ కథతోనూ హీరోలను మెప్పించలేకపోయాడు.
ఇటీవలే ఒక కథ తీసుకెళ్లి గీతా ఆర్ట్స్ వాళ్ళకి వినిపిస్తే షాక్ అయ్యారు. ఇప్పుడు తమ నిర్మాణంలో, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే చిత్ర కథను పోలి ఉందట. ఇద్దరు దర్శకులు ఒకే ఐడియాతో కథ రాసుకోవడం, అది కూడా ఒకే బ్యానర్ కు పనిచేయడం యాధృచికమనే చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మరొక కథను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సెన్సిబుల్ దర్శకుడు త్వరలో హీరోని ఎవరినైనా తన కథతో ఒప్పించగలడా లేదా అన్నది చూడాలి.