
యావత్ సినీ లోకమే కాదు… ప్రపంచంలోని తెలుగు వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉండడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడం.. వీరితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్.. అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటించడం ..హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ సహా సముద్ర ఖని, శ్రియా శరన్ తదితరులు నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. కేవలం ఇదే కాదు బాహుబలితో పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడం సినిమా ఫై మరింత అంచనాలు పెరిగేలా చేసాయి. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ ప్రేక్షకులతో పాటు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు సినిమా మొత్తం ఈ ఇరువురు చూడలేదట. అందరితో పాటు మీరు కూడా సినిమా చూడాలని రాజమౌళి చెప్పడం తో వారు కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.
రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా…ఈరోజు గురువారం సినీ ప్రముఖులతో పాటు హీరోల ఫ్యామిలీ సభ్యులు కూడా ప్రత్యేక షోస్ ద్వారా సినిమాను చూడబోతున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ గచ్చిబౌలి AMB సినిమాస్ లో ప్రత్యేకంగా ఒక స్క్రీన్ లోని టికెట్లు అన్నిటిని కూడా తన కుటుంబ సభ్యుల కోసం అలాగే సన్నిహితుల కోసం బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకే ప్రత్యేకంగా సెలబ్రిటీల కోసం షోను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ ప్రత్యేకమైన షో కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అగ్రహీరోలు దర్శకులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షో కు మెగాస్టార్ చిరంజీవి , మహేష్ బాబు , అల్లు అర్జున్, రవితేజ , రామ్ పోతినేని, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు హాజరుకాబోతున్నట్లు సమాచారం.