
`బాహుబలి` రానాకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా నటుడిగా నిలబెట్టింది. ఈ సినిమా తరువాత పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సొంత చేసుకున్నారు. భల్లాల దేవుడిగా ఈ చిత్రంలో రానా కళ్లతో పలికించిన భావాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అయితే ఈ పాత్ర తనని వెతుక్కుంటూ రావడానికి ప్రధాన కారణం వేరే వుందని రానా తాజాగా వెల్లడించారు.
లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం అయిపోయిన రానా అందరిలాగే ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించడానికి లైవ్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్స్, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే తనకు `బాహుబలి` అవకాశం ఎలా వచ్చిందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
రానాతో క్రిష్ తెరకెక్కించిన చిత్రం `కృష్ణం వందే జగద్గుమ్`. ఇందులో రానా చెప్పే `దేవుడు అంటే సాయం.` అంటూ చెప్పిన డైలాగ్‌లు.. నటన రాజమౌళికి ఎంతగానో నచ్చాయట. సినిమా చూసిన ఆయన భల్లాల దేవుడి పాత్రకు తనని ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. ఇంత వరకు ఈ విషయాన్ని రానా ఏ ఇంటర్వ్యూలోనే వెల్లడించలేదు.