
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ , ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ వద్ద సందడి మొదలైంది.
ఇక ఏపీలో అయితే ప్రభాస్ అభిమానులు పండగ వాతావరణంలో ఉన్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో రాధేశ్యామ్ ప్రదర్శితమవుతోన్న అప్సర థియేటర్‌ను అధికారులు సీజ్ చేసి అభిమానులను నిరాశకు గురి చేసారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షో ప్రదర్శించారని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. మరోపక్క తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని మహిళా ప్రేక్షకుల కోసం రాధేశ్యామ్ స్పెషల్ షో ప్రదర్శించారు. వీపీసీ థియేటర్లలోని ఒక స్ర్కీన ను కేవలం మహిళలకే కేటాయించి షో వేశారు. ఈ సందర్భంగా మహిళలు ఈలలు, కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.