
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ మూవీ ఫైనల్ గా డిజాస్టర్ అనిపించుకుంది. అన్ని చోట్ల భారీ నష్టాలు రావడం ఖాయంగా తేలింది. ప్రభాస్ – పూజా హగ్దే కలయికలో రాధాకృష్ణ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ రాధేశ్యామ్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి ఆట తోనే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాలతో థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రెండు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయగా..ఆ తర్వాత నుండి పూర్తిగా పడిపోయాయి.
నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ఫైనల్ గా డిజాస్టర్ అనిపించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో 55 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను వంద కోట్ల రూపాయలకు పైగా (హయ్యర్స్ తో కలిపి) అమ్మారు. ఆ మొత్తం వెనక్కు రావడం కష్టమే అని తేలిపోయింది. ఫలితంగా రాధేశ్యామ్ సినిమాకు ఏపీ, నైజాంలో 40 కోట్లకు పైగా నష్టం తప్పేలా లేదు. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు 15 కోట్ల నష్టం వచ్చేలా ఉన్నట్లు సమాచారం. అటు నార్త్ లో కూడా వసూళ్లు ఏమాత్రం లేవు. వారం రోజుల్లో వసూళ్లు అటుఇటుగా 20 కోట్ల రూపాయలు వచ్చాయంటే సినిమా రిజల్ట్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ రీజియన్స్ లో కూడా రాధేశ్యామ్ ఫెయిల్ అయింది. ఉన్నంతలో ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ బాగున్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ కూడా డల్ అయింది. మొత్తం మీద ఎన్నో అంచనాలు , ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అనుకుంటే ఢమాల్ అనిపించుకుంది.