
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా ఇప్పటం లో ఆవిర్భావ సభ వేలాదిమంది అభిమానులు , కార్య కర్తల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ సభ లో మరోసారి పవన్ కళ్యాణ్ వైసీపీ ఫై నిప్పులు చెరిగారు. అలాగే తాము అధికారంలోకి వస్తే అప్పుల్లో ఉన్న ఏపీని.. అప్పుల్లేని ఏపీగా చేయడమే లక్ష్యం అన్నారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని తెస్తాం.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తాం.. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం.. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇస్తాం అని హామీల వర్షం కురిపించారు.
సులభ్ కాంప్లెక్సులో ఉద్యోగాలివ్వం.. యువత వారి కాళ్ల మీద వాళ్లే నిలబడేలా చేయూత ఇస్తామన్న ఆయన.. వ్యాపారం చేసుకునే యువతకు ఐదేళ్లల్లో ఐదు లక్షల మంది యువతకు రూ. 10 లక్షలు ఇస్తాం అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం.. జనసేన అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని చేపడతాం.. ప్రైవేట్ రంగంలో కూడా ఏటా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పవన్ చెప్పకనే చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాలు పక్కనపెట్టి.. పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.
ఇక సభ లో పవన్ మాట్లాడిన తీరుకు వైసీపీ మంత్రి నాని కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు. చిరంజీవికి నమస్కారం పెట్టని మీ సంస్కారం ఎక్కడా?, చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడ ఉండేవారు? అని మంత్రి ప్రశ్నించారు. తీగలాంటి నీకు ఊతకర్రలా చిరంజీవి నిలబడ్డారని ఆయన గుర్తు చేసారు.