
2021 క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఈ సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి ఈ భారీ మల్టీస్టారర్‌లో కలిసి నటిస్తున్నారు. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
సోమవారం ఉదయం సంస్థ కార్యాలయంలో దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ క్లాప్ నిచ్చారు. మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర దర్శకుడు సాగర్ చంద్రకు ఈ మూవీ స్క్రిప్ట్‌ని స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అందజేశారు.
ఈ సందర్భంగా రానా చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. `మరో ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎంతో మంది ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్స్‌తో కలిసి నటించాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకోవడం సంతోషంగా వుంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా వున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి థ్యాంక్స్` అని రానా సోషల్ మీడియా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇందులో నటించే హీరోయిన్‌లు, పాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.