
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మాడ్సన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
దర్శకత్వం: హేమంత్ మధుకర్
నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్
సంగీతం: గిరీష్ . జి సౌండ్ ట్రాక్ గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : షానియెల్ డియో
ఎడిటింగ్ : ప‌్రవీణ్ పూడి
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్ : 02 – 10 – 2020
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి చిత్రాల తరువాత అనుష్క పాన్ ఇండియా స్టార్ అయ్యారు. లేడీ సూపర్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. విజయశాంతి తరువాత ఆ స్థాయిలో స్టార్‌డమ్‌ని అనుష్క సొంతం చేసుకుంది. దీంతో ఆమె నటిస్తున్న సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అనుష్క నటించిన తాజా చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. గత ఏడు నెలలుగా కరోనా స్వైర విహారం చేస్తుండటం, థియేటర్లు రీఓపెన్ కాకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకుందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
సాక్షి (అనుష్క) మూగ, చెవిటి యువతి. మంచి పెయింటర్ కూడా. ఆంటోనీ ( మాధవన్ ) ఓ ఫేమస్ మెజీషియన్. ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ తరువాత సెలబ్రేషన్ కోసం ఇద్దరు కలిసి వెకేషన్‌కి వెళతారు. 1972లో హాంటెడ్ హౌస్‌గా క్లోజ్ చేసిన వుడ్ సైడ్ విల్లాలో సాక్షికి కావాల్సిన పెయింట్ వుంటుంది. అది గమనించిన ఆంటోనీ సాక్షిని అక్కడికి తీసుకెళతాడు. అక్కడే ఆంథోని హత్యకు గురవుతాడు. అంతా ఆంటోనీని హాంటెడ్ హౌస్‌లో వున్న జోసెఫిన్ వుడ్ ఆత్మే చంపేసిందని భావిస్తుంటారు. అయితే ఈ కేసుని టేకప్ చేసిన క్రైమ్ డిటెక్టివ్ (అంజలి) కీలక ఆధారాల్ని సేకరిస్తుంది. ఆ తరువాత లాగినా కొద్దీ డొంక కదిలినట్టు గా కేసు రసవత్తర మలుపులు తిరుగుతూ సియాటెల్‌లో కనిపించకుండా పోతున్న అమ్మాయిల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. చివరికి ఏమైంది. మాధవన్‌ని హత్య చేసింది ఎవరు? సాక్షికి చీకట్లో కనిపించింది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. కొంత కాలం సినిమాలకు దూరంగా వుండాలని ఫిక్సయిన అనుష్క ఈ కథ చెప్పిన వెంటనే ఎందుకు నటించిందన్నది సినిమా చూస్తే అర్థయమవుతుంది. సాక్షి పాత్రని బాగా ఇష్టపడింది కాబట్టే ఎలాగైనా ఈ మూవీ చేయాలని ఫిక్సయి నటించింది. ఇక ఆంటోని పాత్రలో నటించిన మాధవన్ తనదైన స్టైల్లో మ్యాడీ రక్తికట్టించాడు. `రెండు` మూవీ తరువాత అనుష్క , మాధవన్‌ల జోడీ మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
షానియెల్ డియో అందించిన ఫొటోగ్రఫీ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్ చిత్రాలకి మెయిన్ ఎస్సెట్ ఫొటోగ్రఫీ. ఆ విషయంలో ఈ చిత్రానికి షానియెల్ డియో అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకి హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్న పీల్‌ని కలిగిస్తుంది. గిరీష్ నేపథ్య సంగీతం , గోపీ సుందర్ అందించిన సంగీతం ఆకట్టుకున్నాయి. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే పై మరింతగా దృష్టి పెట్టుంటే బాగుండేది. ప్రవీన్ పూడి ఎడిటింగ్ ఫరవాలేదు. అయితే ఆసక్తికరంగా కట్ చేసి వుంటే మరింత మెరుగ్గా వుండేది.
విశ్లేషణ:
హారర్ థ్రిల్లర్ కథకు మూగ, చెవిటి యువతి పాత్రని జోడించి హేమంత్ కథని రాసుకున్న తీరు ఆకట్టుకునేదే అయినా దాన్ని ఇంటెన్స్‌గా పక్కా స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ .. సర్‌ప్రైజింగ్ సన్నివేశాలు వున్నా అక్కడక్కడ డల్ ఫేజ్‌ని మెయింటెయిన్ చేయడంతో సినిమా సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బోరింగా వున్నాయి. పైగా కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేకపోవడం ఈ మూవీకి పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. దీంతో ఈ సినిమా ఫలితంపై పెద్ద ప్రభావాన్ని చూపిచింది. థ్రిల్లర్ చిత్రాల్ని ఇష్టపడే వారికి కూడా ఆకట్టుకోవడం కష్టమే. హేమంత్ దర్శకుడిగా ఫరవాలేదనిపించిన స్క్రీన్‌ప్లే విషయంలో, కథని నడిపించే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని వుంటే ఫలితం మరోలా వుండేది.
రేటింగ్ : 2.5/5