
హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ నిన్న (ఏప్రిల్ 28) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భాంగా నిఖిల్..తన తండ్రితో పెనవేసుకున్న బంధాన్ని, పోగుచేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు.
‘నా తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్ యూ. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్ చేయడం.. ఇవన్నీ నేను మిస్ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.
మరో పోస్ట్ లో తండ్రి గురించి చెప్తూ.. ‘ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. తను నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని కలలు కన్నాడు. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్ టాపర్. ఎప్పుడూ కష్టాన్ని నమ్మేవాడు. జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. కార్టికోబాసల్ డీజెనరేషన్ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.