
సమంత, నాగచైతన్య కలిసి ఇప్పటి వరకు నాలుగు చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్ హిట్ పెయిర్‌గా నిలిచింది. `ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ.. ఈ నాలుగు చిత్రాల్లో ఆటోనగర్ సూర్య మినహా మిగతా మూడు చిత్రాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. `మజిలీ` తరువాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఐదవ సినిమా తెరపైకి రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కినేని ఫ్యామిలీ హీరోలతో `మనం` వంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు దక్కించుకున్నారు విక్రమ్ కె. కుమార్. ఈ సినిమా తరువాత ఆయన రూపొందించిన హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. దీంతో రేసులో వెనకబడ్డ విక్రమ్ కుమార్ మళ్లీ అక్కినేని ఫ్యామిలీనే నమ్ముకున్నారు. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కొన్ని కండీషన్‌లతో సమంత ఈ చిత్రాన్ని అంగీకరనించినట్టు తెలిసింది.
బీవీఎస్ రవి కథ అందిస్తున్న ఈ చిత్రానికి `థాంక్ యూ` అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారట. ప్రస్తుతం నాగచైతన్య `లవ్ స్టోరీ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్‌గా వుంది. ఇక దిల్ రాజు `వకీల్ సాబ్`, బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న `జెర్సీ` చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇదే టైమ్‌లో `వి` రిలీజ్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాతే నాగచైతన్య, విక్రమ్ కుమార్ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే వచ్చే ఏడాది చైతూ – విక్రమ్ కుమార్‌ల సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.