
మలయాళ మూవీ `జల్లికట్టు` ఆరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. భారత్ తరుపున అంతర్జాతీయ ఉత్తమ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి ఆస్కార్ విభాగానికి 27 లు పోటీపడగా అంతులో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికయింది.
ఈ సందర్భంగా జ్యూరీ బోర్డ్ , ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్. అహుల్ రావైల్ మాట్లాడుతూ `మనుషుల్లో వుండే సహజసిద్ధమైన మానవత్వాన్ని బయటికి తీసిన చిత్రమిది. మనం జంతువులకన్నా అధ్వాన్నంగా ఉన్నాము. మానవ ప్రవృత్తులు జంతువులకన్నా ఘోరంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది మనమందరం గర్వించదగ్గ ఫిల్మ్. ఈ మూవీలోని భావోద్వేగాలు మనందరినీ (జ్యూరీ) కదిలించాయి` అన్నారు.
లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత ఏడాది అక్టోబర్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రానికి విమర్శకులు ప్రశంసలు కురిపించారు. 2021 ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకుండా ఏప్రిల్‌లో జరగబోతోంది. ఏప్రిల్ 25న అవార్డుల వేడుక జరగనుంది.