
గౌతమ్ గంభీర్.. టీమిండియా గర్వించే క్రికెటర్లలో ఒకడు. రెండుసార్లు టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ గంభీర్ ఆటతీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండిట్లోనూ తన ప్రదర్శనే జట్టును విజయతీరాలకు చేరేలా చేసింది. ముఖ్యంగా 2011 ఫైనల్స్ లో గంభీర్ పెర్ఫార్మన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు అంటే ఈ ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఫైనల్స్ లో శ్రీలంకపై లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. అద్భుత ఫామ్ లో ఉన్న టెండూల్కర్ తక్కువ స్కోర్ కే అవుట్ అయిపోయి ఇండియాను నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ధోనితో కలిసి గంభీర్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వ్యక్తిగతంగా 97 పరుగులు చేసిన గంభీర్ శతకం కొట్టే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తర్వాత ధోని తిరుగులేని ఆటతీరుతో జట్టుకి విజయం అందించి భారత్ ను వరల్డ్ కప్ విన్నర్ ను చేసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. మొదట కష్టమంతా తాను పడితే తర్వాత ధోని వచ్చి క్రెడిట్ తీసుకెళ్లిపోయాడు అంటూ గంభీర్ ఇప్పటికె చాలా సందర్భాల్లో తన అసహనాన్ని వ్యక్తపరిచిన సంగతి తెల్సిందే.
నిజానికి ధోని కెప్టెన్ అయ్యాక ఓపెనర్స్ లో రొటేషన్ పాలసీని తీసుకొచ్చి గంభీర్, సెహ్వాగ్, టెండూల్కర్ లలో ఇద్దరికే స్థానం ఉంటుందని చెప్పాడు. వారి వల్ల ఫీల్డింగ్ లో వెనుకబడుతున్నామని ధోని ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్, సెహ్వాగ్ నెమ్మదిగా జట్టులో స్థానం కోల్పోయాడు. గంభీర్ రిటైర్ అయినప్పటినుండి ధోనిపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జట్టులో బాగా ఆడుతున్న సీనియర్లమైన మా ముగ్గురిని ఇబ్బంది పెట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ లో క్రెడిట్ కూడా తీసేసుకున్నాడు అన్న తరహాలో వ్యాఖ్యానించిన గంభీర్ ఇప్పుడు మరోసారి ధోని మీద పడ్డాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్స్ లో తాను సెంచరీ మిస్ అవ్వడానికి ధోనీనే కారణమని పేర్కొన్నాడు. ఇది పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
వివరాల్లోకి వెళితే.. వరల్డ్ కప్ ఫైనల్స్ లో తాను ఇండియాను నెగ్గించాలన్న పట్టుదలతోనే ఆడుతున్నాను. వ్యక్తిగత స్కోర్ ఎంత ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అయితే సరిగ్గా నేను 97 పరుగులు దగ్గర ఉన్నప్పుడు ధోని నా దగ్గర వచ్చి ఇంకో మూడు పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తావ్, సెంచరీ చేసేయ్ అని నాకు చెప్పాడు. అప్పటిదాకా నా స్కోర్ ఎంత అన్నది కూడా పట్టించుకోని నాకు సెంచరీపైకి మనసు వెళ్ళింది. భారీ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాను. నా దృష్టిని మరల్చి నా అవుట్ కు ధోని కారణమయ్యాడు అని ఒక వింత వాదనను గంభీర్ తెరపైకి ఇప్పుడు తేవడం నిజంగా ఆశ్చర్యకరమే. సెంచరీ చేయమని ప్రోత్సహిస్తే కూడా తప్పంటున్నట్లు గంభీర్ మాట్లాడడం ఏంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.