
ఐశ్వర్య పేరు తెలియిన సీని అభిమానులు లేరు. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి. ఈ పిల్లి కళ్ల ఐశ్వర్య రాయ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందంలో అయినా, అభినయంలో అయినా ఏ మాత్రం వంక పెట్టలేని ఈ ముద్దుగుమ్మ సినిమాలు బాగా తగ్గించింది. అయినా క్రేజ్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు.
2018లో ఫన్నే ఖాన్ సినిమాలో కనిపించిందీ నీలికళ్ల సుందరి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ అందాల తార ఓ సినిమాలో నటిస్తోంది. అదికూడా ఓ దక్షిణాది సినిమాలో. పేరు పొన్నియన్ సెల్వన్. గతంలో ఐశ్వర్యతో ఇరువర్, గురు, రావణ్ వంటి సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఐశ్వర్యతో పాటు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్‌హాసన్‌తో పాటు కోలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను చూసిన ఐశ్వర్య వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించింది. వెంటనే ఆమెను లేపిన రజనీ తనను ఆప్యాయంగా హత్తుకున్నాడు.
ఆతర్వాత ఒకరికి ఒకరు చేతులు జోడించి నమస్కారాలు తెలుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఐశ్వర్య మనసు కూడా అందమే’, ‘ఆమె సంస్కారానికి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా రజనీ, ఐశ్వర్యలిద్దరూ రోబో సినిమాలో జంటగా నటించారు.