
అక్టోబర్ ఐదో తేదీ వరకూ దసరా మహోత్సవాలు జరుగుతాయి. 9 రోజులపాటు 10 అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలే శరన్నవరాత్రులు. మహిషాసురుడి సంహారం కోసం జగన్మాత ఒక్కో రోజు ఒక్కో అవతారంలో యుద్ధం చేసిందని, ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున మహిసాసురిని సంహకరించిందని చెబుతారు.
అందుకే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించిన పూజలు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. దుర్గాదేవి అవతారంలో ఉన్న అమ్మవారు భక్తులను కటాక్షించారు. ఇక దసరా మహోత్సవాలలో ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపురసుందరిగా దర్శనమీయనున్నారు. ఎంతో మహిమాన్విత మైన బాలా త్రిపురసుందరీదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది.
విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. కర్నూలుజిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శైలిపుత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాల త్రిపురసుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రకాశంజిల్లా త్రిపురాంతకంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రిపురాంతకం, బాల త్రిపురసుందరీదేవి ఆలయాలను మంత్రులు రోజా, ఆదిమూలపు సురేష్, అంజాద్‌భాషలు దర్శించుకున్నారు. ఏపీ,తెలంగాణలోని ఆలయాల్లో అమ్మవారి నామస్మరణం మార్మోగుతోంది. భక్తులు తొమ్మిదిరోజులు ఉపావాసంతోపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు.