
ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్‌కు అధినేత, నిర్మాత నారంగ్(78) మృతిచెందారు. కొద్దీ రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధ పడుతూ.. స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కాగా ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన స్వర్గస్తులయ్యారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నారంగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’అని చిరంజీవి ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా నారాయణ్ దాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘నారాయణ్ దాస్ ఇకలేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేస్తున్నాను. నారయణ్ దాస్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుధీర్‌బాబు, సుషాంత్, శివకార్తికేయతో పాటు పలువురు సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.