
నందమూరి బాలకృష్ఱకు గతేడాది కలిసిరాలేదు. తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథని రెండు భాగాలుగా వెండితెరపైకి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. పైగా ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలని చూపించకుండా బయోపిక్ ని ముగించారని, ఇలా చేస్తే దీన్ని బయోపిక్ అని ఎలా అంటారని విమర్శలు వినిపించాయి.
ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య మాత్రం వాటిపై స్పందించడానికి ఇష్టపడలేదు. వెటరన్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్‌తో `రూలర్` చిత్రాన్ని చేసినా ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. పైగా ఈ చిత్రంలో బాలయ్య మేకప్ సరిగా సెట్‌కాలేదని విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సన్నివేశాన్ని కంప్లీట్ చేశారు.
ఇదిలా వుంటే బాలయ్య తదుపరి చిత్రానికి ఇటీవలీ కాలంలో ఫేమస్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇటీవలే బాలయ్యకు బుర్రా సాయిమాధవ్ కథ వినిపించారట. లైన్ నచ్చడంతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని, అలా వస్తే తన దర్శకత్వంలోనే సినిమా చేద్దామని మాట ఇచ్చారట. టాలీవుడ్‌లో రైటర్‌లు డైరెక్టర్‌గా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.