
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ `బాహుబలి`తో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్. ఆ ఇమేజ్‌కు తగ్గట్టే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ వరుసగా మరో మూడు పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
ఇందులో `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్‌తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో `ఆదిపురుష్` మూవీ చేయబోతున్నారు. ఇదిలా వుంటే ప్రభాస్ 21వ చిత్రంగా తెరపైకి రానున్న సైన్స్ ఫిక్షన్ కోసం బాలీవుడ్ స్టార్స్ ని లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునేని రంగంలోకి దింపిన నాగ్ అశ్విన్ తాజాగా శుక్రవారం షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. w ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. వైజయంతీ సంస్థ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఈ సినిమా లోని ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ని చిత్ర బృందం ఫైనల్ చేసింది. ఇందుకు బిగ్‌బీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెండితెరపై మరో అద్భుతమైన కాంబినేషన్‌కు నాగ్ అశ్విన్ సినిమా వేదిక కాబోతోంది. తొలి సారి `మనం` చిత్రంలో గెస్ట్‌గా కనిపించిన అమితాబ్ ఆ తరువాత `సైరా`లోనూ గురువు పాత్రలో మెరిన విషయం తెలిసిందే. తాజగా ప్రభాస్ సినిమాలో అమితాబ్ సైంటిస్ట్‌గా కనిపిస్తారా? లేక దేవ కన్య దీపికకు తండ్రిగా కనిపిస్తారా అన్నది తెలియాల్సి వుంది.