
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్థంభించిపోయింది. కరోనా ప్రభావం చాప కింద నీరులా తెలుగు రాష్ట్రాలని కూడా వణికిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా కారణంగా కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని కారణంగా సమాన్య ప్రజలు, సినీ జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
అన్ని రంగాలు బంద్‌ని పాటిస్తుండటంతో వ్యాపారాలు, ఇండస్ట్రీస్, సినిమా థియేటర్లు బంద్‌ని పాటిస్తున్నాయి. సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో సినీ జనం కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వారి కోసం సినీ స్టార్లు, బిజినెస్ మెన్‌లు భారీవిరాళాలుప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో, ఏపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు.
కరోనా సంక్షభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు తన వంతు బాధ్యతగా కోటి 25 లక్షలు ప్రకటించారు. ఇందులో ఏపీ సీఎం సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షలు, తెలుగు సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ ( కరోనా క్రైసిస్ చారిటీ) కోసం 25 లక్షలు అందించారు. 25 లక్షల చెక్కును సీసీసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.కల్యాణ్‌కు అందజేశారు. కరోనా కట్టడికి స్వియ నిబంధనలతో ఇంట్లోనే వుండాలని, ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.