
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ..ఇప్పుడు 26 జిల్లాలుగా మారాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్‌గా జగన్ ఈరోజు ప్రారంభించారు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలను విభజించారు ముఖ్యమంత్రి జగన్. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు పెట్టామన్నారు.
గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. కొత్తగా పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ , పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఏర్పాటు చేసారు. అలాగే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు తాజాగా కలెక్టర్ పోస్టులు దక్కాయి. పలు చోట్ల నగర కమిషనర్లుగా, ఇతర బాధ్యతల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ హోదా దక్కింది.