
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. శంకర్ తొలిసారి స్ట్రైట్ తెలుగు సినిమా చేయనుండడం విశేషమే. రామ్ చరణ్ మరోసారి ప్యాన్ ఇండియన్ అటెంప్ట్ ను చేస్తున్నాడు ఈ చిత్రం ద్వారా. మరోవైపు నిర్మాత దిల్ రాజుకు కూడా ఈ చిత్రం చాలా ముఖ్యం. చాలా స్పెషల్. ఎందుకంటే తన బ్యానర్ లో రూపొందుతోన్న 50వ చిత్రం ఇది. ఇందుకోసమే ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇక శంకర్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. కచ్చితంగా బడ్జెట్ పరిమితులు దాటుతుంది.
అయితే దిల్ రాజుకు ఊహించని విధంగా వచ్చిన ఆఫర్ తనను ప్రొడక్షన్ ఇంకా తొలిదశలో ఉండగానే లాభాల్లోకి తీసుకొచ్చింది. జీ స్టూడియోస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ హోల్ సేల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్ ను కలిపి అన్ని భాషలకు గాను దాదాపు 350 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకుంది జీ సంస్థ. ఇంకా రీమేక్ రైట్స్, ఆడియో రైట్స్ ను దిల్ రాజు అమ్ముకోవచ్చు. అలాగే ఈ చిత్రాన్ని తిరిగి ప్రాంతాల వారీగా కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో, ఏ రకంగా చూసినా కూడా దిల్ రాజు సేఫ్ అయినట్లే. మంచి డీల్ రావడంతో ఇక దిల్ రాజు ఏ చీకూ చింత లేకుండా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవచ్చు.