
కెరీర్ తొలి నాళ్లలో స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే అవకాశం రావాలని ఎదురుచూడని డైరెక్టర్ అంటూ వుండరు. అయితే అలా ఎదురుచూడని ఓ యంగ్ డైరెక్టర్‌కు ఆ గోల్డెన్ ఛాన్స్ లభిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్కే యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి లభించినట్టు తెలిసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`. పృథ్విరాజ్ సుకుమారన్, బీజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఆర్. సచి(సచిదానందన్) ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈయన అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు.
ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఈ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి మార్పించారు. `అప్పట్లో ఒకడుండేవాడు` చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న సాగర్ చంద్ర ఈ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్చారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే బాధ్యతల్ని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి అప్పగించినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో రీమేక్ చేయబోతున్నారు. మరో కీలక పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారట.
ఇటీవల ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చూసిన పవన్‌కల్యాణ్ అత్యంత తక్కువ రోజుల్లో ఈ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాల్ని మేకర్స్ పవర్‌స్టార్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.