
మెగాస్టార్ చిరంజీవి టెర్రిఫిక్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఒక సినిమా అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే ఆయన మరో రెండు చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం చిరు `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎండోమెంట్ అధికారిగా ఇందులో ఆయన పాత్ర ఉండబోతోంది. కీలక అతిథి పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారు.
త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు మెగాస్టార్ మరో రెండు చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి తమిళ హిట్ చిత్రం `వేదాలం` కాగా మరొకటి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్`. మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమార్ కలిసి నటించిన ఈ చిత్రం త్వరలో తెలుగులో రీమేక్ కాబోతోంది.
ఈ మూవీ స్క్రిప్ట్‌ని సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ తరువాత `సాహో` ఫేమ్ సుజీత్ కూడా మార్పలు చేశాడు కానీ చిరుకు పెద్దగా నచ్చలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ని వి.వి.వినాయక్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు వినాయక్ ఈ స్క్రిప్ట్‌లో మార్పుల కోసం రైటర్ ఆకుల శివని రంగంలోకి దించారట. ఆకుల శివ – వినాయక్ కలయికలో చాలా హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ నమ్మకంతో స్క్రిప్ట్ బాధ్యతల్ని ఆకుల శివకు అప్పగించారట వినాయక్.