
రేయ్.. నా మాట విను.. యుద్దంలో గెలవడానికి ధర్మరాజు అంతవాడే అబద్దం చెప్పాడు గదా..? అని S/O సత్యమూర్తి లో లాజికల్ గా మాట్లాడిన శ్రీ విష్ణు లో ఉన్న Talent ని టాలీవుడ్ కొంచెం లేట్ గానే గుర్తించింది.
అసలేం యాక్టింగ్ రాకుండా కేవలం తెల్లతోలు ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు చేస్తే హీరోగానే చేస్తామని బిల్డప్ ఇస్తూ ఉంటే, శ్రీ విష్ణు మాత్రం మరొక రవితేజ మాదిరిగా ప్రస్తుతం టాలీవుడ్ లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు డిఫరెంట్ కథలతో మంచి సినిమాలు చేస్తున్నాడు.
బాణం, సోలో లాంటి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసిన శ్రీ విష్ణు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించాడు. పవన్ సాదినేని దర్శకత్వం లో వచ్చిన “ప్రేమ ఇష్క్ కాదల్” సినిమాలో రాయల్ రాజు అనే క్యారెక్టర్ లో తనలోని పూర్తి స్థాయి నటన ప్రేక్షకులకు చూపించాడు. తర్వాత నారా రోహిత్ ప్రతినిధి సినిమాలో హోమ్ మినిస్టర్ కుమారుడి క్యారెక్టర్ లో నటించాడు. సాగర్ K చంద్ర దర్శకత్వంలో వచ్చిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాలో రైల్వే రాజు క్యారెక్టర్ శ్రీ విష్ణు స్టామినా ఏంటో అందరికీ తెలియజేసింది.
ఆ తర్వాత మా అబ్బాయి ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చేశాడు. హిట్ అవలేదు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా లో హీరో రాం ఫ్రెండ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన మెంటల్ మదిలో వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన నీది నాది ఒకే కథ సినిమాలు శ్రీ విష్ణు ను హీరోగా నిలబెట్టాయి.
ఈ సంవత్సరం “బ్రోచేవారెవరురా” అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. నారా రోహిత్ తో అసుర అనే సినిమా చేసిన కృష్ణ విజయ్ దర్శకత్వంలో ప్రస్తుతం “తిప్పరా మీసం” అనే ఒక డిఫరెంట్ సినిమాతో ఈ శుక్రవారం మన ముందుకు వస్తున్నాడు శ్రీ విష్ణు.
మరి ఈ సంవత్సరం ఇప్పటికే ఒక మంచి హిట్ ను నమోదు చేసిన శ్రీ విష్ణు కి ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం