
చంద్రబాబు, వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఒకే తెరపై కనిపిస్తే ఇంకే ముందు వారి అభిమానులకు పండగే. ఈ సూపర్ థాట్‌తో ఓ దర్శకుడు వెబ్ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ రణరంగంలో బద్ధశత్రువులైనా వ్యక్తిగత జీవితంలో మాత్రం మంచి మిత్రులన్న విషయం చాలా మందికి తెలియదు. ఇదే నేపథ్యంలో వెబ్ సినిమాని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో మంచు విష్ణు `చదరంగం` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించిన విషయం తెలిసిందే. దీని ద్వారా దర్శకుడిగా పరిచయమైన చక్ర తన తదుపరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వెబ్ మూవీని రూపొందించబోతున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టే క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహం ఎలా వుంది? … ఆ తరువాత రాజకీయంగా ఎలా శత్రువులు అయ్యారు?.. ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి వంటి కారణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.
దీనికి సంబంధింయిన మరిన్ని వివరాల్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలిసింది. ఇందులో చంద్రబాబు పాత్రలో ఎవరు నటిస్తారు. వైఎస్‌గా ఏ హీరోని ఎంచుకుంటారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.