
హాస్య నటుడు సత్య కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం `వివాహ భోజనంబు`. అర్జానీరాజ్ కథానాయిక. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమన్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ అబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్ర టీజర్‌ని చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది.
కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథగా ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వినోదాల విందుకు ఏమాత్రం లోటులేని విధంగా ఆద్యంత వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ సినిమా రూపొందుతోంది. ఇదే విషయాన్ని చిత్ర బృందం టీజర్‌లో వెల్లడించింది.
పది రూపాయల పార్కింగ్ టిక్కెట్ కొనడానికి, స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ రావడంతో సింపుల్‌గా 30 మందితో పెళ్లి తంతుని కానిచ్చేస్తాడు. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది.. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్నికష్టాలు పడ్డాడన్నది తెరపైన చూడాల్సిందే అంటున్నారు చిత్ర బృందం. నెల్లూరు ప్రభ పాత్రలో సందీప్‌కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. పిసినారి పాత్రలో సత్య అదరగొట్టడని తెలుస్తోంది. ఓవరాల్‌గా టీజర్ చూస్తుంటే ఈ మూవీ పేరుకు తగ్గట్టే వినోదాల విందుగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.