
ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు ఇతరుల మనోభావాలను కించపరచవచ్చు. మనకి ఆ ఉద్దేశం లేకపోయినా కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతీ మాటను ప్రజలు సునిశితంగా గమనిస్తుంటారు. ఈ కాలంలో ఊరకనే మనోభావాలు హర్ట్ అయిపోతుంటాయి కాబట్టి సెలెబ్రిటీలు ఒకటికి రెండు సార్లు తాము మాట్లాడే మాటల గురించి చూసుకోవడం మంచిది. వాళ్ళ ఉద్దేశం మంచిదైనా చెడుని ఎక్కువగా చూసే సమాజం కాబట్టి విమర్శల పాలు కావడం తప్పకపోవచ్చు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హిట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల వల్ల ఒక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదం పెద్దదవుతుండడంతో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే ఈ నెల 22న ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూని ప్రకటించిన విషయం తెల్సిందే. సాయంత్రం 5 గంటలకు అందరూ తమ తమ ఇళ్ల వద్దే చప్పట్లు కొట్టి ఈ కష్ట సమయంలో ఆడుకుంటున్న డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్ కు, ఇతర ఎమర్జెన్సీ సేవకులకు సంఘీభావంగా చప్పట్లు కానీ ఏదైనా సౌండ్ కానీ చేయమని పిలుపునిచ్చారు. దాన్ని కొంత మంది తప్పుగా అర్ధం చేసుకుని సాయంత్రం 5 గంటలకు రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు వేయడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేసారు.
ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తాను చూసిన ఒక సంఘటన గురించి స్పందించాడు. ఇక్కడే ఒక టీ స్టాల్ ఓపెన్ చేసారు. అక్కడ కొంత మంది గుమిగూడి ఉప్పర సోది పెట్టారు. మీరేమైనా కరోనాకి మందు కనిపెడుతున్నారా. చిప్ దొబ్బిందా బయటకు రావొద్దు అంటుంటే అని క్లాస్ పీకాడు.
క్లాస్ పీకడం వరకూ కరెక్ట్ కానీ ఉప్పర అన్న పదం వాడడం వల్ల ఆ వర్గం వాళ్ళు హర్ట్ అయ్యారట. అందుకోసమే ఇప్పుడు విశ్వక్ సేన్ తనకు ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదని తనను క్షమించాలని కోరాడు.