
తమిళ సీనియర్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్‌లో చేరారు. కరోనా లక్షణాలు స్వల్పంగా వుండటంతో ఆయన గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. దీంతో ఆయనకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందించడం మొదలుపెట్టారు.
ఈ నెల 2న కోలు కోవడం, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో విజయ్ కాంత్‌ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన మళ్లీ మంగళవారం హస్పటల్‌లో చేరారు. దీంతో ఆయనకు మళ్లీ ఆరోగ్యం దెబ్బతిందని జోరుగా వార్తలు షికారు చేయడం మొదలైంది. సోషల్ మీడియాలో విజయ్ కాంత్ ఆరోగ్యంపై పలు వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో డీఎండీకే పార్టీ ఓ ప్రకటనని విడుదల చేసింది. విజయ్‌కాంత్ ఆరోగ్యంగానే వున్నారని, కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన తదుపరి పరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యంగానే వున్నారని, ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మకండని పేర్కొంది.