
`అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తరువాత సుకుమార్‌తో కలిసి పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేశారు. `పుష్ప` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీ లేకుండానే సుకుమార్ ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. కీలక షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నల్లమల అడవుల్లో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా దెబ్బతో షూటింగ్ ప్లాన్ అంతా తారుమరైపోయింది. ఇందులో విలన్‌గా ఫారస్ట్ ఆఫీసర్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్టు ప్రకటించారు.
విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి స్పందించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన విజయ్ సేతుపతి `పుష్ప` చిత్రం నుంచి డేట్స్ సమస్య కారణంగా తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రం నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపించినా తనకు తప్పడం లేదని స్పష్టం చేశారు. ఆ స్థానంలో `భైరవగీత` ఫేమ్ ధనంజయని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలిసింది.