తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటులు మిగిలిన భాష లో సక్సెస్ అయినా కాకపోయినా, ఇతర నటులు మంచి కథతో సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు వాళ్లను నెత్తిన పెట్టుకున్నారు. ఈ ట్రెండ్ అప్పుడెప్పుడో రజనీకాంత్ తో మొదలై సూర్య, విక్రమ్, కార్తి, విజయ్ ఆంటోని ఇలా అందరితో కొనసాగుతోంది. స్వయంకృషితో పైకి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి కూడా ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇస్తున్నాడు. “సంఘ తమిళన్” అనే చిత్రంతో విజయ్ సేతుపతి మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమాని తెలుగులో “విజయ్ సేతుపతి” అనే అతని పేరుతోనే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
విశేషమేమిటంటే ఈ సినిమా తమిళం మరియు తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతోంది. విజయ్ చందర్ ఈ సినిమాకి దర్శకుడు. విజయ్ సేతుపతి సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ తమిళ ట్రైలర్ అంత నిడివి లేకపోయినా విజయ్ సేతుపతి ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతో చేసినట్లు ఉంది. ట్రైలర్ లో చూసిన కథ ప్రకారం విజయ్ నటించిన కత్తి అనే సినిమాని పోలినట్లు ఉంది మరి సైరా సినిమాలో చిరంజీవికి ఏ మాత్రం తగ్గకుండా నటించి మెప్పించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులను తన చిత్రంతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.