
ఈ దసరా సీజన్ పై టాలీవుడ్ చాలానే ఆశలు పెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు వస్తోన్న పెద్ద పండగ ఇదే. దసరా సందర్భంగా ప్రేక్షకులు థియేటర్లకు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది. ఈ దసరా సీజన్ కు నాలుగు చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. మహా సముద్రం, వరుడు కావలెను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, పెళ్లి సందD చిత్రాలు దసరాకు తమ సినిమాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు.
ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి కానీ సడెన్ గా వరుడు కావలెను ప్రమోషన్స్ ఆగిపోయాయి. దానికి కారణం దసరా రేసు నుండి తప్పుకోవడమే అని అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలవుతుండడంతో అన్ని సినిమాలతో కాంపిటీషన్ మంచిది కాదని భావించి వరుడు కావలెను రిలీజ్ ను వాయిదా వేసారట. అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల కానుండగా ఇప్పుడు అక్టోబర్ 22కు కానీ మరో తేదికి కానీ మారుస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నిన్నటితో వరుడు కావలెను డబ్బింగ్ కూడా పూర్తయింది. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. నాగ శౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వరుడు కావలెను చిత్రాన్ని నిర్మిస్తోంది.