
టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నలుగురు హీరోలుంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ్‌తో కలిసి ముగ్గురు హీరోలున్నారు. వీళ్లతో పాటు తెలుగు తెరపై కొత్త వారసులు రాబోతున్నారు. దర్శక నిర్మాతలకు సంబంధించిన వారసులు కూడా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో బిజీగా వుంటే చిన్న తనయుడు సాయిగణేష్ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు.
వీళ్ల తరహాలోనే ఇద్దరు క్రేజీ నిర్మాతల తనయులు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు దిల్ రాజు కాంపౌండ్ నుంచి రాబోతుంటే మరో హీరో లగడపాటి శ్రీధర్ క్యాంప్ నుంచి రాబోతున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌రెడ్డిని హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇదే సినిమాతో లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహదేవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి `రౌడీ బాయ్స్` అనే టైటిల్‌ని కన్ఫమ్ చేశారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది.
లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో అన్వర్‌గా కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత చేసిన `గోలీసోడా` ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. దాంతో ప్రాపర్‌గా విక్రమ్ పరిచయమవుతున్న సినిమాగా `రౌడీ బాయ్స్`ని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర బృందం.