
స్టార్ హీరో స్థాయి పాపులారిటీ బిత్తిరి సత్తి సొంతం. తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ యాస, భాషకు బిత్తిరి తనాన్ని జోడించి కొత్త తరహా హావ భావాలతో ఆకట్టుకున్న యాంకర్ బిత్తిరి సత్తి. తనదైన శైలిలో విచిత్ర హావ భావాలు పలికిస్తూ తీన్మార్ కార్యక్రమానికి వన్నె తెచ్చాడు బిత్తిరి సత్తి. ఆ తరువాత తన వల్లే ఛానల్ పాపులర్ అయ్యిందంటూ ఓవరాక్షన్ చేయడంతో అతన్ని ఛానల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
ఆ తరువాత అతని పాపులారిటీని గమనించిన టివి 9 అతనికి భారీ సాలరీని అందిస్తూ తమ సంస్థలోకి ఆహ్వానించింది. ఇస్మార్ట్ న్యూస్ అంటూ సదరు ఛానల్‌లో వార్తలు అందిస్తున్న బిత్తిరి సత్తిని తాజాగా టీవి 9 యాజమాన్యం విధుల నుంచి తప్పించి షాకిచ్చినట్టు తెలిసింది. మంగళవారం బిత్తిరి సత్తిని టీవి 9 యాజమాన్యం విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే..ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో బిత్తిరి సత్తి స్క్రిప్ట్ తను చెప్పినట్టే వుండాలని పట్టు బట్టడం, గత కొంత కాలంగా తన పారితోషికం పెంచాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం తలనొప్పిగా మారిందట. ఎన్ని సార్లు పద్దతి మార్చుకోవాలని యాజమాన్యం హెచ్చరించినా బిత్తిరి సత్తి ఆ మాటల్ని పెడచెవిన పెట్టి తను అనుకుంది చేసుకుంటూ వెళ్లాడని, దాంతో ఆగ్రహించిన యాజమాన్యం బిత్తిరి సత్తిన తమ ఛానల్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిందని తెలిసింది.