
దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ ఏడాది కిందటే లాక్ అయింది. అన్నీ సజావుగా జరిగుంటే ఈపాటికి సగం షూటింగ్ కూడా అయిపోయేది. కానీ సైరా సినిమా ఆలస్యం కావడంతో కొరటాల శివ ప్రాజెక్ట్ వెనక్కి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సైరా విడుదలవుతుండడంతో నవంబర్ నుండి చిరంజీవి కొరటాల శివతో కలిసి పనిచేస్తాడు.
ఎప్పుడో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసేసిన కొరటాల శివ, కాస్టింగ్ విషయంలో మాత్రం కిందామీదా పడుతున్నాడు. ఇప్పటికే చిరుకి హీరోయిన్ గా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కాజల్, తమన్నా, హ్యూమా ఖురేషి, నయనతార అంటూ చాలా మందిని కన్సిడర్ చేసారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ, ఈ సినిమా కోసం త్రిషను సంప్రదించాడట.
ఎప్పటినుండో తెలుగులో మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న త్రిష కూడా వెంటనే ఓకే చెప్పేసినట్లు సమాచారం. ఎప్పుడో 2006లో స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు వీరిద్దరూ. త్రిష కనుక ఈ సినిమాలో ఫైనల్ అయిపోతే మళ్ళీ 13 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తారన్నమాట. ఏదేమైనా మరికొద్ది రోజులు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది.