
వందలాది చిత్రాలతో హాస్యభరిత పాత్రలతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన హాస్యనటుడు వేణుమాధవ్ ఇకలేరు. మూత్రపిండాల సమస్యతో ఈ నెల 9న ఆసుపత్రిలో చేరిన వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటికి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12.21 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
మిమిక్రీ కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వేణు మాధవ్, అంచెలంచలుగా ఎదిగి టాప్ కమెడియన్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. హీరోకి స్నేహితుని పాత్రల్లో ఎక్కువగా వేణు మాధవ్ కనిపించేవారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, వెంకీ, ఛత్రపతి, పోకిరి, ఆది, సింహాద్రి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వేణు మాధవ్. హంగామా చిత్రంలో హీరోగా నటించారు.
ఇప్పటికే ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, కొండవలస వంటి ప్రముఖ కమెడియన్ లను కోల్పోయిన తెలుగు సినీ ఇండస్ట్రీకి వేణు మాధవ్ మృతి తీరని లోటనే చెప్పాలి.
