
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే రిపబ్లిక్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి సన్నాసి అని పిలవడం చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత టాలీవుడ్ నిర్మాతల మండలి ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమని దాంతో ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించకూడదని ప్రెస్ నోట్ ను విడుదల చేసాయి.
ఇక పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని, పేర్ని నానిని కూల్ చేయడానికి అన్నట్లుగా నిర్మాతల మండలి మరోసారి మీట్ అయింది. మచిలీపట్టణంలోని పేర్ని నాని ఆఫీస్ లో దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీ, ఏషియన్ సునీల్, మైత్రి నవీన్, బన్నీ వాసు, డివివి దానయ్య తదితరులు భేటీ అయ్యారు.
“రీసెంట్ గా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి క్లియర్ చేసారు. అలాగే టికెట్ ధరలపై మరోసారి చర్చించారు. ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల విషయంలో సవరణ చేయడానికి సముఖంగా ఉంది.” ఇక పేర్ని నాని మాట్లాడుతూ, “చిరంజీవి నాకు ఫోన్ చేసారు. రీసెంట్ గా జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేసారు. నెగటివిటీని పట్టించుకోకుండా ఇండస్ట్రీ బాగు కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు” అని ఆయన అన్నారు.