
సోషల్ మీడియా ప్రభావం పెరిగి పోవడంతో సినిమాలని థియేటర్లలో కంటే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లలో చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనికి తోడు సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్‌లని ఆదరించేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ సంస్కృతి హాలీవుడ్‌లో వచ్చేసింది. అక్కడ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ల హవా నడుస్తోంది.
అది ఇటీవలే బాలీవుడ్‌ని కూడా తాకేసింది. దక్షిణాది మాత్రం ఇప్పుడిప్పుడే అటు వైపుగా అడుగులు వేస్తోంది. దీన్ని గమనించిన బడా కార్పొరేట్ కంపెనీలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆల్ట్ బాలాజీ, జీ5 వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రంగంలోకి దిగేశాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ భారతీయ మార్కెట్‌ని శాసించడం మొదలుపెట్టాయి.
దీన్ని నిశితంగా గమనించిన టాలీవుడ్ దిగ్గజం అల్లు అరవింద్ ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ మాట్రిక్స్ ప్రసాద్, మై హోమ్ రామేశ్వరరావు, షాడో పార్ట్‌నర్ దిల్ రాజుతో కలిసి డిజిటల్ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లని ప్రారంభించిన ఈ సంస్థకి తాజాగా ఓ పేరుని ఖరారు చేసినట్టు తెలిసింది. `అహా` అనే టైటిల్‌ని తమ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. ఇందులో లోకల్ కంటెంట్‌కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, త్వరలోనే దీనిపై ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుందని తెలిసింది.