Homeటాప్ స్టోరీస్దర్శక ధ్రువతార – కట్టా సుబ్బారావు

దర్శక ధ్రువతార – కట్టా సుబ్బారావు

దర్శక ధ్రువతార – కట్టా సుబ్బారావు
దర్శక ధ్రువతార – కట్టా సుబ్బారావు

మనకు కనపడేది వార్త. కానీ, ఎప్పటికి నిలిచి ఉండేది చరిత్ర. వార్తలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. చరిత్ర తాత్కాలికంగా మరుగునపడి ఉంటుందేమో కానీ, ఎప్పటికీ అజేయంగా నిలిచే ఉంటుంది. నిరంతరం మార్పులకు లోనయ్యే సినిమా పరిశ్రమలో కూడా కథలు చెప్పే పద్ధతి మారవచ్చు కానీ, కథా వస్తువులకు పునాదులు వేసిన వ్యక్తులు చిరస్మరణీయులుగా సినిమా ఉన్నంత కాలం నిలిచిపోతారు. వారిలో ఒక దర్శక దిగ్గజం కట్టా సుబ్బారావు గారు. కట్టా సుబ్బారావు గారు 1980 వ దశకంలో తెలుగు తెరను ఏలిన దర్శకుడు. కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ డ్రామాలు తీయడంలో నేర్పరి. ఆయన కెరీర్ లో సుమారు 20 సినిమాలు చేసారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సబ్జెక్ట్ కథలను మాస్‌కి కనెక్ట్ అయ్యే విధంగా తీయడమే ఆయన ప్రత్యేకత. తెలుగు సినిమా లెజెండ్స్ అయిన నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరూ కలిసి నటించిన ‘వయ్యారి భామలు-వగలమారి భర్తలు’ సినిమా ఒక్కటి చాలు ఆయన స్టామినా ఏంటో తెలియడానికి.

అప్పట్లో ఇద్దరు పెద్ద స్టార్లను పెట్టి, మల్టీ స్టారర్ సినిమా తీసే గట్స్ ఉన్న వ్యక్తి ఆయన. ఆ సినిమాలో ఎన్టీఆర్ – కృష్ణ అన్నదమ్ములుగా పోటాపోటీగా యాక్ట్ చేశారు. ఆ సినిమా కలేక్షన్స్ పరంగా అప్పట్లో ఒక సంచలనం. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్‌ ఇలా అప్పట్లో హేమాహేమీల్లాంటి లాంటి ప్రముఖ హీరోలతో సినిమాలు తీసిన సుబ్బారావు గారు ఒక్క సూపర్ స్టార్ కృష్ణతోనే నాలుగు సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ తొలినాళ్లలో ‘మొగుడు కావాలి’లాంటి సూపర్‌హిట్ ఇచ్చారు. ఆ సినిమా ఖైదీ కంటే ముందే రిలీజ్ అయ్యి, 175 రోజులు ఆడింది. చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా అది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్రీరస్తు-శుభమస్తు’ కూడా ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి గారు సుబ్బారావు గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రేమ నాటకం’ సినిమాలో కూడా అతిధి పాత్ర లో కనిపించారు. ఒక హీరో సినిమాలో మరొక స్టార్ హీరోని అతిధి పాత్రలో ప్రవేశపెట్టి, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చే ట్రెండ్ ఆ తర్వాత అనేక సినిమాల్లో కొనసాగింది. కట్టా సుబ్బారావు గారు స్టార్స్‌ తో సినిమాలు చేసినా కూడా, ముందు స్టోరీకే వేల్యూ ఇచ్చేవారు. భారతీయ వివాహ సంస్కృతి, భార్యాభర్తల దాంపత్యం, కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, ఇలా ఇప్పుడు ఫాలో అయ్యే ట్రెండ్ ని ఆయన అప్పట్లో క్రియేట్ చేసి వెళ్లారు.

- Advertisement -

వియ్యాలవారి కయ్యాలు, బంగారు బావ, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కొంటె మొగుడు-పెంకి పెళ్లాం, పెళ్లి గోల, అల్లుడుగారు జిందాబాద్, గడసరి అత్త-సొగసరి కోడలు, ఘరానా గంగులు, కోరుకున్న మొగుడు, అక్క మొగుడు-చెల్లెలి కాపురం, పుణ్యం కొద్దీ పురుషుడు లాంటి వరుస సూపర్ హిట్ సినిమాలను చిత్రాలను డెరైక్ట్ చేశారు. ఇక సుమన్, చంద్రమోహన్ నటించిన ‘మాంగల్య బంధం’ (1985) ఆయన ఆఖరి సినిమా. 48 ఏళ్ళకే ఆయన శివైక్యం చెందారు. మనం మొదట్లో చెప్పినట్లు, ఒకరు చెప్తేనే తెలియడానికి, కొంతకాలం పాటు చెప్పకపోతే మర్చిపోవడానికి కట్టా సుబ్బారావు గారు వార్త కాదు. తెలుగు సినిమా దర్శకులలో ఒక ధ్రువతార. ఆయన తర్వాత ఎందరో, ఆయన సినిమాలను ఆదర్శంగా తీసుకుని కథలు రాసి, సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమా ఊపిరి ఉన్నతకాలం ఆయన ఉనికి అజరామరం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All